7, ఏప్రిల్ 2012, శనివారం

తెలంగాణ ప్రాజెక్టులు-సీమాంధ్రకు నీళ్ళు

తెలంగాణ ప్రాజెక్టులు-సీమాంధ్రకు నీళ్ళు
తెలంగాణ వస్తే మాకు నీళ్లు రావు అని అమాత్యులు జె.సి. దివాకర్‌డ్డి సెలవిచ్చారు. మీ కామెంట్?
-గొట్టిపర్తి యాదగిరి, ఆలేరు, నల్లగొండ జిల్లా


ఇది పూర్తిగా నిరాధారం- అసత్యం-పైన ప్రాజెక్టులు కట్టితే కిందికి నీళ్లు రాకపోతే, మనపైన (ఆంధ్ర రాష్ట్రంపైన) మహారాష్ట్ర, కర్ణాటకలున్నాయి. మరి కృష్ణా, గోదావరి నదుల్లో మన రాష్ట్రంలోకి ప్రవహించకుండా ఉండాలి. అలా జరుగుతోందా? ఇది కేవలం ‘తెలంగాణ’ అవతరణాన్ని అడ్డుకోవడానికి, సీమాంవూధలోని సామాన్య ప్రజానీకాన్ని భయవూభాంతులకు గురిచేసే ప్రచారం మాత్రమే- పుట్టిస్తున్న పుకార్లు మాత్రమే. అంతర్‌రాష్ట్ర నదులపైన ఒడంబడికలుంటాయి. అవగాహన పత్రాలుంటాయిటిబ్యునల్ ఆదేశాలుంటాయి. కట్టుదాటి ప్రవర్తిస్తే జోక్యం చేసుకోవడానికి కోర్టులుంటాయి. ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి ఇదేమన్న నియంతృత్వ పరిపాలనా? మన రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి.

మూడు ప్రాంతాలకు సంబంధించిన నది కృష్ణానది. కోస్తాంధ్ర, తెలంగాణకు సంబంధించి గోదావరిపైన ప్రధానమైన ప్రాజెక్టులు జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీ. ఈ నాలుగు అమలులో ఉన్నవి. కృష్ణానదికి ముఖ్యమైన ఉపనది తుంగభద్ర పైన తుంగభవూద ప్రాజెక్టు (కర్ణాటకలో ఉన్నది)- దిగువన రాజోలిబండ ఆనకట్ట (ఎడమ గట్టు కర్ణాటకలో కుడిగట్టు), ఆంధ్రవూపదేశ్‌లో దాని కింద సుంకేసుల ఆనకట్ట (ఇప్పుడు బ్యారేజీ) ఉన్నాయి. గోదావరి విషయానికి వస్తే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, చిట్ట చివరన ధనళేశ్వరం (సర్ ఆర్థర్ కాటన్) బ్యారేజీ ఉన్నాయి. ఇటీవలే నాగార్జునసాగర్ జలాశయం నీటినుపయోగించుకుని కొంతమేరకు నీటినందిస్తూ ఇంకా నిర్మాణం పూర్తి కాని ఎలిమినేటి మాధవడ్డి ప్రాజెక్టు ఉంది.

ఇది ఎత్తిపోతలుమగావిటీ కాలువ (బాగా వరదలు వచ్చినప్పుడు) ప్రాజెక్టు-వీటి కి అదనంగా జూరాలపైన ఆధారపడ్డ భీమా, నెట్టంపాడు, శ్రీశైలంపైన ఆధారపడ్డ కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, వెలిగొండ, ఎస్‌ఆర్‌బీసీ, హంద్రీనీవా, గాలేరు, నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు, వీటి అనుబంధ రిజర్వాయర్ కాలువ ప్రాజెక్టులు. అలాగే గోదావరి నదికి సంబంధించిన శ్రీరాంసాగర్ ద్వితీయ దశ, వరదకాలువ, ప్రాణహిత చేవేళ్ల, ఎల్లంపల్లి, దేవాదుల, రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకాలు, కంతనపల్లి, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. పోలవరం నిర్మాణంలో ఉన్నా, సుప్రీంకోర్టు అంతిమ తీర్పుపైన దాని భవిష్యత్తు ఆధారపడి ఉంది. పోలవరం రాదేమో అని చేపట్టిన పుష్కరం, తాటిపూడి, వెంకటనగరం పంపింగ్ స్కీం లు పాక్షికంగా అమల్లో ఉన్నాయి.

ఇక గమనించవలసిన విషయమేమంటే అంతర్‌రాష్ట్ర నదులే కాదు, అంతర్ దేశాల నదులపైన ఆయా దేశాల మధ్య జరుగుతున్న ఒప్పందాల మేరకు వాటి నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఒడంబడికలను ఉల్లంఘించి పై దేశాలు కాని, రాష్ట్రాలు కాని తమ ఇష్టం వచ్చినట్లు జలాశయాలు నింపుకుంటే కింది దేశాలకు- రాష్ట్రాలకు నీళ్లు రావు. కనుకనే అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా అంతర్ దేశ, రాష్ట్ర నదుల నిర్వహణకు చట్టబద్ధమైన కంట్రోల్ బోర్డులు ఉంటాయి. ఉదాహరణకు మనదేశంలో సట్లెజ్, బియా స్, రావి నదుల నిర్వహణ కోసం భాక్రా-బియాస్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు జరిగింది. ఏదైనా ఒక ప్రాజెక్టు నుంచి రెండు లేక అంతకుమించి రాష్ట్రాలు లబ్ధిపొందుతూ ఉంటే విధిగా అన్ని రాష్ట్రాల ప్రతినిధులు సభ్యులుగా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఆధ్వర్యంలో బోర్డును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయా రాష్ట్రాల కేటాయింపుల ఆధారంగా ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం, సక్రమంగా ఆ నీరు ఆ రాష్ట్రాలకు చేరేట్టు చూసే బాధ్యత ఆ కంట్రోల్ బోర్డుది.

ఉదాహరణకు తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా అటు కర్ణాటకకు, ఇటు ఆంధ్రవూపదేశ్‌కు నీరు సరఫరా అవుతుంది. తుంగభద్ర కంట్రోల్ బోర్డు నీటి బట్వా డా బాధ్యతలను చేపట్టింది. ఈ బోర్డును కేంద్ర వూపభు త్వం ఏర్పాటు చేసింది. కేంద్ర జలసంఘం ఛీఫ్ ఇంజనీ ర్ అధ్యక్షులుగా, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్ ప్రతినిధులు సభ్యులుగా ఈ బోర్డు పనిచేస్తోంది.

పంజాబ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 1966 లోని సెక్షన్ 79 అనుసరించి ఏర్పాటైన భాక్రా, బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అధ్యక్షులుగా, పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం, ఢిల్లీ ప్రతినిధులు సభ్యులుగా వ్యవహరిస్తారు. సట్లెజ్, రవి, బియాస్ నదుల వినియోగం తోపాటు భాక్రానంగల్, బియాస్ ప్రాజెక్టులద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు బట్వాడా విషయాలపై బోర్డు చర్చించి నిర్ణయాలు చేస్తుంది. ఇదే విధంగా మనదేశంలో అనేక కంట్రోల్ బోర్డులు, అథారిటీలు అంతర్‌రాష్ట్ర నదీ జలాల బట్వాడా అంశాల అమలు విషయమై ఏర్పాటయ్యాయి. నదీజలాలపై నెలకొనే తగాదాల పరిష్కార నిమిత్తం రాజ్యాంగంలోని 262 అధికరణం ప్రకా రం కేంద్రం జోక్యం చేసుకుని, అవసరమైన పక్షంలో ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయడంలో దోహదపడుతుంది. కృష్ణానది జలాల కేటాయింపుల నిమిత్తం లోగడ బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడి తమ ఆదేశాలను వెలువరించిన విష యం పాఠకులకు విదితమే- ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పా టు అయింది. అంతిమ తీర్పు ఇంకా వెలువడవలసి ఉంది.

అదే విధంగా గోదావరి జలాల వినియోగ విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్, మధ్యవూపదేశ్, (ఇప్పుడు ఛత్తీస్‌గఢ్), ఒరిస్సా రాష్ట్రాలు పరస్పరం చేసుకున్న ఒడంబడికల ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ తమ అవార్డును ప్రకటించింది. ట్రిబ్యునల్ అవార్డు అంటే సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. దానిపైన ఎలాంటి అప్పీలు ఉండదు. అయితే ఏరాష్ట్రమైనా ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా నడుచుకోకుండా, ఆదేశాలను ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టు తలుపు తట్టవచ్చు. ఉదాహరణకు అలమట్టి ఎత్తు విషయంలో మన రాష్ట్రం కర్ణాటక పై, మిగులు జలాల ఆధారంగా మనం నిర్మిస్తున్న ప్రాజెక్టులపైన కర్ణాటక సుప్రీంకోర్టు తలుపు తట్టడం, మధ్యంతర ఉత్తర్వులు వెలువరించి, ఈ సమస్యను తేల్చవలసిన బాధ్యతను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌పైన సుప్రీంకోర్టు పెట్టడం జరిగింది.

ఇదేవిధంగా, మహారాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు ఇంకా ఇతర కట్టడాలు శ్రీరాంసాగర్‌పై దుష్ప్రభావం చూపెట్టాయని మనం సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ కేసుపైన అంతిమ నిర్ణయం ఇంకా వెలువడలేదు. ఇంతకూ చెప్పొచ్చేదేమంటే అంతర్ రాష్ట్ర నదుల నీటి కేటాయింపులు, కేటాయింపుల ప్రకారం అమలు జరిగేట్టు చూడటం వగైరా విషయాల బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఏర్పాటయ్యే సంస్థలు నిర్వహిస్తాయి. ఉల్లంఘించిన సందర్భాల్లోనే కోర్టులు జోక్యం చేసుకుంటాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే శ్రీశైలం, నాగార్జున్‌సాగర్ రాజోలిబండ కాలువ ప్రాజెక్టుల నిర్వహణకు విధిగా కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. (రాజోలిబండపైన కంట్రోల్‌బోర్డు ఏర్పాటు విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇదివరకే నిర్ణయం తీసుకుంది) ఎందుకంటే ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా నీరు ఇటు తెలంగాణకు, అటు సీమాంధ్ర రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టుల కేటాయింపుల ఆధారంగా నీటి బట్వాడా జరుగుతుంది. కేటాయింపులకు మించిగాని ఎక్కువగా గాని ఆయా రాష్ట్రాలకు నీరు బట్వాడా జరుగదు. ఒకవేళ ఉల్లంఘన జరిగితే కోర్టుల జోక్యం తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు దేశంలో ఉన్న వ్యవస్థ ప్రకారం ఉమ్మడి ప్రాజెక్టులు కాకుండా కేవలం ఒక రాష్ట్రానికే నీరందిస్తున్న ప్రాజెక్టుపైన అజమాయిషీ కంట్రోల్ బోర్డు అధీనంలో లేదు. కాని అంతర్ రాష్ట్ర నదులపైన వెలసిన ప్రాజెక్టుల విషయంలో ఆయా రాష్ట్రాలు కేవలం తమ అజమాయిషీలో ఉండటం మూలంగా ఒడంబడికలు, ట్రిబ్యునల్ ఆదేశాలు ఉల్లంఘిస్తున్న ఫిర్యాదులు ఎక్కువవుతున్న పరిస్థితులను గమనించి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మొత్తం బేసిన్ లోని అన్ని ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత కోసం చట్టబద్ధమైన సంస్థ ఉండాలని ప్రతిపాదించింది.

ట్రిబ్యునల్ ఆదేశాలు అంతిమంగా వెలువడితే కృష్ణానదిలోని అన్ని ప్రాజెక్టులపై అజమాయిషీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఏర్పాటయ్యే చట్టబద్ధమైన సంస్థదే అవుతుంది. చాలా సమస్యలకు ఇది పరిష్కారమని నిపుణులు భావిస్తున్నారు. మన రాష్ట్రంలో నీటి విషయంలో ఏర్పడ్డ అనేక అవకతవకలు దోపిడీ, దౌర్జన్యాలు, అన్యాయాలను దృష్టిలో వుంచుకొని ఆంధ్రవూపదేశ్ సమైక్యంగా ఉన్నా, లేక తెలంగాణ ఏర్పడ్డ రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులపైన అన్ని ప్రాజెక్టుల నిర్వహణ కోసం చట్టబద్ధమైన సంస్థ ఏర్పాటు చేయాలని శ్రీ కృష్ణ కమిటీ కూడా సిఫార్సు చేసింది. త్వరలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని, తెలంగా ణ, సీమాంధ్ర ప్రాజెక్టుల నీటి కేటాయింపుల విషయంలో ఎవరికీ అన్యా యం జరుగకుండా, నియమనిబంధనల ప్రకారం ట్రిబ్యునల్ ఆదేశాలననుసరించి అంతర్ జాతీయ న్యాయసూవూతాలు, జాతీయ జలవిధానం, సహజ న్యాయసూవూతాల ప్రకారం కృష్ణా, గోదావరి జలాలు సక్రమంగా రైతుల పంటపొలాలకు అంది ఆయా రాష్ట్రాలను సుభిక్షం కావిస్తాయని ఆశిద్దాం. అనవసరంగా నీటి విషయంలో అపోహలు సృష్టించవద్దని రాజకీయ నాయకులకు, కుహనా మేధావులకు వినవూమంగా వినతి.

జలవివాదాలు
రాజ్యాంగంలోని 262 అధికరణంలో అంతర్ రాష్ట్ర నదీ జలాల తగాదాల పరిష్కారం కోసం రెండు అంశాలను పొందుపరచటం జరిగింది.

ఒకటి-అంతర్‌రాష్ట్ర నదీ జలాల వినియోగం, పంపకం, నియంవూతణ విషయంలో ఏదైనా తగాదా ఏర్పడితే దాన్ని పరిష్కరించే నిమిత్తం పార్లమెంట్ చట్టం చేయవచ్చు. రెండు- పైన చెప్పిన తగాదాల విషయంలో సుప్రీంకోర్టుగానీ, ఇతర కోర్టులుగానీ జోక్యం చేసుకోరాదని పార్లమెంట్ చట్టం చేయవచ్చు. ఈ 262 అధికరణం కింద పార్లమెంట్ 1956 సంవత్సరంలో అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం (ఇంటర్ స్టేట్ వాటర్ డిస్‌ప్యూట్ యాక్ట్) రూపొందించింది.

ఆ చట్టంలోని సెక్షన్ 3 ఏం చెప్పుతోందంటే..
‘పరాయిరాష్ట్రం చేసే లేక చేయపోయే చట్టం వల్ల కానీ అధికారిక చర్యల మూలంగా కానీ అంతర్ రాష్ట్ర జలాల వినియోగం, పంపకం నియంవూతణ విషయంలో తమ అధికారాలను అమలు చేయడంలో ఒక రాష్ట్రం లేక ఆ రాష్ట్ర సంబంధిత సంస్థ విఫలంకావడం కారణంగా కానీ, తమతో ఆ పరా యి రాష్ట్రం చేసుకున్న ఒప్పందం ప్రకారంగా కార్యక్షికమాలు అమలు జరగని సందర్భం కానీ, ఆ పరాయి రాష్ట్రంతో తమ రాష్ట్రానికి నీటి తగదా ఏర్పడిందని లేక ఏర్పడబోతుందని, ఆ తగాదా మూలంగా తమ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లే అవకాశముందని అనిపించినప్పుడు ఆ రాష్ట్రం నీటి తగాదాని పరిష్కరించేందుకు న్యాయమండలి ఏర్పాటు చేయమని కేంద్రాన్ని కోరవచ్చు.

సెక్షన్ 4లో ఏముందంటే ...
సెక్షన్ 3 కింద ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నీటి తగాదాని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేస్తే, చర్చలు, సంప్రదింపుల ద్వారా తగాదా పరిష్కారం సాధ్యం కాదని కేంద్రానికి అనిపిస్తే కేంద్ర ప్రభుత్వం అధికార పత్రం (official gazette)ద్వారా ఆ నీటి తగాదా పరిష్కార నిమిత్తం న్యాయమండ లిటిబ్యునల్)ని ఏర్పాటు చేయవచ్చు. ఇప్పటివరకు మనదేశంలో ఐదు జలవివాద ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి. అవి కృష్ణా, గోదావరి, నర్మద, కావేరి, రావి- బియాస్ ట్రిబ్యునళ్లు.
-ఆర్ .విద్యాసాగర్ రావు
కేంద్ర జల సంఘం మాజీ ఛీఫ్ ఇంజనీర్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి